ప్రముఖ దర్శకుడు మహేంద్రన్‌ కన్నుమూత

చెన్నై: ప్రముఖ తమిళ దర్శకుడు జె. మహేంద్రన్‌ (79) కన్నుమూశారు. మూత్రపిండాల సంబంధిత సమస్యతో కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు చికిత్స అందించి, సోమవారం డిశ్చార్జ్‌ చేశారు. మంగళవారం ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఆయన నివాసంలో భౌతికకాయాన్ని ఉంచారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఇళయరాజా, రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, తలైవసల్‌ విజయ్‌ తదితరులు మహేంద్రన్‌ నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.

రజనీకాంత్‌ ‘ముల్లుమ్‌ మలరుమ్‌’ సినిమాతో 1978లో మహేంద్రన్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మెగాఫోన్‌ పట్టకముందు ఆయన పలు సినిమా కథలు రాశారు, స్క్రీన్‌ప్లే బాధ్యతలు కూడా నిర్వర్తించారు. అంతేకాదు ఆయనలో మంచి నటుడు కూడా ఉన్నారు. ‘తెరి’, ‘పేట’, ‘బూమెరాంగ్’, ‘నిమిర్‌’, ‘మిస్టర్‌ చంద్రమౌళి’ తదితర సినిమాల్లో ఆయన నటించారు. మహేంద్రన్‌ మృతి చెందారని తెలుసుకున్న పలువురు  ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్‌.కె. స్టాలిన్‌, ఎమ్‌. శశికుమార్, ఎ.ఆర్‌. మురుగదాస్‌, పా రంజిత్‌, పీసీ శ్రీరామ్‌, గిబ్రన్‌, లక్ష్మీ రమ్యకృష్ణన్‌, సిబి సత్యరాజ్‌, వివేక్‌, శీను రామస్వామి తదితరులు సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేశారు.

Leave a Reply

*